Monday 25 December 2017

వరూధినీ ప్రవరుల కథ

                               
               చాలా మందికి ప్రవరుడు గురించి గాని వరూధినీ గురించి కాని తెలియదు. కాని ఆసక్తి ఉంటుంది తెలుసుకొవాలని , అటువంటి వారెవరి కెవరికైన ఉపయోగ పడాలని భావిస్తూ నా  తొలి అనువాదం                 

                వరూధినీ ప్రవరాఖ్యుము
    (This is our lesson in our high school or college I think. Just for recollection of poems I searched in internet and I translated the poetry into prose. I request you all to read this and give your comments….Raja Mouli Valmikam)

         (అల్లసాని పెద్దన గారి  ప్రవరాఖ్యము అను స్వారోచిష మనుసంభవము )

   {అరుణాస్పదపురం)
   మ॥వరుణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌
బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌.
            పూర్వము ఆర్యా వర్త దేశమలోని గంగా నది ఒడ్దున అరుణాస్పదమనే పురము గలదు. ఆ ఊరిలో గల విప్రులందరు మంచి విద్యా సంపన్నులు మరియు ఆచార పరాయణులు, దైవభక్తి, మరియు రాజభక్తి   కలవారు. ఆ ఊరిలో గల మహిళలు రంభ తిలోత్తమ వంటి అప్సరసలకంటే అందమైన వారు మరియు నాట్య కళా కోవిదులు.
{ప్రవరుని గొప్ప తనము}
ఉ॥ ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై.       
      ఆ అరుణాస్పదమనె ఆ పట్టణములో ప్రవరుడు అనే బ్రాహ్మణొత్తముడుండే వాడు. అతను మన్మధుని మించిన అందగాడు. మంచి భాషా ప్రావీణ్యము కలవాడు. నిత్యకర్మానుష్టానపరుడు. బ్రాహ్మణ జాతికి ఆభరణము లాంటి వాడు. ఎప్పుడు తన సమయానంతటిని జపతపధ్యానములందు అతిథి అభ్యాగతుల సేవలందు గడపెడి వాడు. ఆతని చక్కదనాన్ని చూసి వారకాంతలకు కూడ ఆతని పట్ల కోరిక ఉదయించి అతని పొందులేని జీవితం వ్యర్థము అని వాపొయేవారు. అతడు ఎప్పుడు తన  ఊరు వదలి వేరే గ్రామానికో పట్టణానికో పోయే వాడు కాదు.
ఆతను యౌవన కాలములో ధనార్జన తో పాటు యాగాలు హోమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన భార్య సోమిదమ్మ. భార్యా భర్తల మధ్య ఎడతెగని అనురాగము ఉండెడిది. ఆతనికి తల్లి తండ్రులందు కూడ భక్తి ఎక్కువే.
         అతడు  ప్రతిరోజు   ఉషః కాలమున నే లేచి వెళ్ళి గంగానదిలో స్నానమాడి ఆ నదీతీరముననే సంధ్యావందనము సూర్యోపాసన కావించుకొని, ఇంటిలో పూజాహోమాదులకు కావల్సిన సమిధలు, పండ్లు, ధర్భలు నువ్వులు మొదలగు వస్తువులు సేకరించుకొని, ఉతికిన మడి దోతులు ధరించిన బ్రహ్మచారి శిష్యులు వెంటరాగా ఇంటికి వచ్చే వాడు. జనులందరు ఆ విప్రవరుని చూసి మెచ్చుకొనెడి వారు.
          ఆతని సౌశీల్యాని, కులమును గుణమును చిన్న వయసునుండే పాటిస్తున్న నియమ నిష్టలను చూసి రాజులెవరినా ఆతనికి అగ్రహారములు, భూములు దానముగా ఇవ్వాలని చూసినా అతడు స్వీకరించచేవాడు కాదు. ఆతని ఇంట పాడికి పంటకు కొదువలెదు.  ఆతని భార్య సోమిదమ్మ అన్నపూర్ణకు తీసిపోదు. అతిథులు ఎప్పుడు వచ్చినా, వారికి కావల్సిన వంటలు వండి, రుచికరమైన భోజనం వడ్డించేది. అతిథులెందరు వచ్చినా   ఆమె, వారి సేవలో అలసి పొయేది కాదు.
      ఆ ఊరికి  ఎవరైనా తీర్థ యాత్రలు చేస్తూ యాత్రికులు వచ్చినారని  ఆ ప్రవరాఖ్యునికి తెలియగనే ఆతడు వారికి ఎదురువెళ్ళి వారి పాదాలకు నమస్కరించి,వారిని సాదరముగా ఇంటికి తోడ్కొనివచ్చి, అర్ఘ్య పాద్యాదులతోపాటు చక్కటి ఆతిథ్యమిచ్చి, కడుపునిండా కమ్మటి భోజనాన్ని పెట్టి సంతృప్త పరచేవాడు.వారు తినిన తరువాత వారికి చక్కటి పడక ఏర్పాటు చేసి, వారి దగ్గరకు వచ్చి కూర్చొని ఆ యాత్రికులు చేసిన తీర్థ యాత్రా మహత్యములను గురించి అడిగెడు వాడు.ఆ తరువాత అతడు ఆ పుణ్య క్షేత్రములు ఎంత దూరములో నున్నవి, వాటిని దర్శించ వలనని కోరికను వ్యక్త పరుస్తూ తను సంసార జంఝాటములో ఉండడము వలన తీర్థ యాత్రలు చేయలేకపోతున్నానని చింతిస్తూ తన తీర్థ యాత్రాభిలాషను తెలిపెడి వాడు.
                   ఈ విధంగా బ్రాహ్మణుడు నిత్యాగ్ని హోత్రియై, అతిథి అభ్యాగతుల సేవలు చేస్తూ కాలము గడపుతుండగా ఒక నాటి ఉషఃకాలమునందు ఒక సిద్ధుడు అనే యోగి యాత్రికుడిగా ఆ ఊరికి వచ్చాడు.                  
     ఆ యోగి ముడిచిన ఒంటి కొప్పుతో, జింక చర్మముతో చేసిన కిరీటము లాంటి టోపిని ధరించి, ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో కోదండములను పట్టుకొని, కురుచనైన అంగవస్త్రముపై తోలు తో చేసిన వడ్డాణము ధరించి ఉన్నాడు.బక్కపలుచని దేహముతో భస్మాలంకృతుడై,చెవులకు రుద్రాక్షలతో చేయబడిన పోగులు ధరించి ఉన్నాడు
.           ఈ విధంగా వచ్చుచున్న ఆ పరమయోగిని చూచి, ప్రవరుడు ఎదురేగి భక్తి తో నమస్కరించి, ఇంటికి తోడ్కొని వచ్చి అర్ఘ్య పాద్యాదులచే పూజించి, చక్కటి రుచికరమైన భోజనముతో సంతృప్తుని గావించి, చక్కని పానుపుపై విశ్రమింపచేసి ఇలా అన్నాడు.             ”ఓ యోగీశ్వరా! మీరలు ఎచటినుండి బయలుదేరినారు, ఎక్కడవరకు మీ ప్రయాణము? మీ రాకచె మా గృహము పావనమైనది. మీ వాక్కులే వేద మంత్రాలు, మీరు కాలుమోపిన ప్రదేశము ప్రయాగకు సమానము, మీ పాదములు కడుగగా వచ్చు పాదోదకమే గంగాజలం. మీ వంటి పరమ యోగులు ఏ గృహస్తుల ఇంటిలో కాలుమోపుతారో, ఎవరి ఇంటిలో స్నాన పానాదులు చేసి మృష్టాన్నభోజనం చేసి వెళ్తారో వారే చరితార్థులు, వారికంటే అదృష్టవంతులు ఎవరు ఉండరీ లోకములో” అని ఇంకా ఇలా అన్నాడు.” సంసార సాగరములో చిక్కుకొన్న మా లాంటి గృహస్తులు   ఉద్దరింప బడాలంటే మీ లాంటి వారి పాదరేణువుల స్పర్శ తప్ప వేరే ఇతర ఔషధం లేదు. మీ పాదరేణువుల స్పర్శతో మా లాంటి గృహస్తులు అన్ని తీర్థయాత్రల ఫలితం పొందుతారు.” ఆ మాటలు విని ఆ యోగి  ప్రవరునితో ఇలా అన్నాడు.
“మీ లాంటి గృహస్తుల వలననే కదా మా వంటి తీర్థ యాత్రికులు కష్టాలు లేకుండ యాత్రలు చేయగలుగుతున్నారు! మా లాంటి పరివ్రాజకులకు గృహస్తుడు తంగేటి జున్నులాంటి వాడు, పెరట్లో ఉన్న కల్పవృక్షము లాంటి వాడు. పాడి పంటలతో ఉన్న గృహ మేధి మాకు దేవుడితో సమానము.  బధిరులకు, కుంటి వారికి గ్రుడ్డివారికి, భిక్షుకులకు, కాపాలికులకు సన్యాసులకు, గృహస్తుడే మూలాధారం. కావున ఓ బ్రాహ్మణోత్తముడా గృహస్థ జీవితమే గొప్పది”. ఈ మాటలు విని ప్రవరుడు” ఓ మహాత్మా! మీరు ఏ ఏ దేశాలందు ప్రయాణించారు, ఏ పర్వతాలు ఎక్కారు, ఏ ఏ తీర్థాలలో స్నానమాచరించారు, ఏ యే ద్వీపాలలో పుణ్యవనాలలో తిరిగారు, ఏ ఏ నదులు దర్శించారు ఆ యా చోట్ల గల వింతలు నాకు చెప్పండి, నేను ప్రత్యక్షంగా దర్శించలేకున్నా, వాటి మహిమ వినుట వలన నాపాపాలు తొలగి పోతాయి గదా!” అని అడుగగనే ఆ మునివర్యుడు సాదరము తో “ ఓ విప్రవర్యా। అయితే చెప్పుతున్నాను,వినుము, నేను  తీర్థ యాత్రల యందు కోరిక గలవాడనై జనపదములు,పుణ్య నదులు అన్ని దర్శించాను. పడమటి కొండలను, తూర్పు కోండలను,హిమాలయాలను అధిరోహించాను. అచటి వింతలు విశేషాలు అన్ని తెలుసుకొన్నాను. నేను కేదారేశ్వరుని దర్శించాను. ప్రయాగ లో ఉన్న మాధవేశ్వరుని సేవించాను, బదరీ నాథ్ క్షేత్రములో ఉన్న నర నారాయణుల దర్శించితిని, ఈ దేశము      ఆ దేశము అన నేల? అవకాశమున్నంతవరకు అన్ని తీర్థాలను దర్శించాను.” అని వివరించాడు.
       అప్పుడు ఆ ప్రవరుడు ఆ ముని వర్యునితో “అయ్యా! నాది ఒక సందేహము.  తమరు అన్యథా భావించక నా సందేహాన్ని తీర్చ గలరని విన్నపము చేస్తున్నాను. మీరు చెప్పిన తీర్థ క్షేత్రములు, పుణ్యస్థలములు అన్ని చూడడానికి కొన్ని సంవత్సరాలు పట్టుతాయేమో?.  మిమ్ముల్ని చూస్తే   చిన్న వయసులోనే ఉన్నట్లు కనపడుతున్నారు, ఇన్ని క్షేత్రాలు తిరుగడము ఎలా సాధ్యమైంది?” అని అనగానే ఆ మునివర్యుడు “ఓ విప్రోత్తమా! మీయొక్క సందేహము సరియైనదే, మీరు మమ్ముల్ను అడగుటలో తప్పు లేదు. మేము సిద్ధులము అగుటవలన అనారోగ్యము, వృద్ధత్వము మమ్ముల్ని బాధించవు.  ఇంకొక ముఖ్య రహస్యము చెప్పుతున్నాను వినుము. ఈశ్వర కృప వలన పాదలేపము అను దివ్యౌషధము నావద్ద కలదు. దాని ప్రభావము వలన అన్ని ప్రదేశాలకు సులభంగా వెళ్ళి వస్తున్నాను.”   ఈ మాటలు వినగానే ఆ బ్రాహ్మణుడు ఆసక్తితో అంజలి ఘటించి “అయ్యా మీరు ఇంతటి గొప్ప సిద్ధపురుషులు అని ఇప్పుడే   తెలుసుకున్నాను. నాపై దయయుంచి ఈ శిష్యుని దూర దేశపు తీర్థయాత్రలు చేయించి ధన్యుని చేయగలరు.” అని ప్రార్థించాడు.
   వెంటనే ఆ సిద్ధుడు నడుముకు కట్టుకున్న దంతపు భరిణే ఒక దానిని బయటి తీసి మూత తెరిచి ఇది ఒక పసరు. దీని ప్రభావము తో నీవు అనుకున్న ప్రదేశానికి వెళ్ళవచ్చు అని ఆ ప్రవరాఖ్యుని పాదాలకు పూసి, ఆ సిద్ధుడు తన దారిన తాను యాత్రలకు వేళ్ళిపోయాడు.
               వెంటనే ఆ ప్రవరాఖ్యుడు యాత్రాసక్తి కలవాడై, ఆరోజు ఉదయమే ఆ పాదలేపన ప్రభావంతో హిమాలయ పర్వతాలలో ఉన్న నదీ నదములను, అరణ్యములను, పర్వతాలను చూడడానికి వెంటనే   బయలుదేరాడు.
            అచ్చటకు చేరుకొని, ఆకాశాన్నంటుతున్న హిమవత్పర్వత శిఖరాలను, ఎత్తైన పర్వతాలనుండి క్రిందికి దుముకుతున్న జలపాతాలను, జింకలవలే సవ్వడి లేకుండ పరుగెత్తుతున్న సెలయేళ్లను, చూసి అచ్చెరువందాడు, బదరీక్షేత్రాన్ని దర్శించాడు. సప్త స్వరాలు వినిపిస్తున్న అలకానదీ ప్రవాహఝరితో పాటు కదంబపూల పరిమళాన్ని ఆస్వాదించాడు. అడవులలో తొండములు చాచి లేత చిగ్ళ్ళను అందుకొని తింటున్న  ఏనుగులను, పొదరిండ్లలో గురక పెట్టి నిద్రపోతున్న పులులను,సెలయెటి ఇసుకలందు పొరలుచున్న వరాహములను చూస్తూ ఎలుగు బంటులు నక్కలు, తోడేళ్ళున్నటువంటి  ఆ పర్వత సానువులందు ,అడవులందు సంచరించాడు.గంగ కొరకై సగరుడు తపము చెసినచోటు,విష్ణువుకూర్మావతారమెత్తి  గిరిని ధరించిన చోటు,పార్వతి శివుని గురంచి తపస్సు చెసిన చోటు దర్శించి అనేక మైన ఓషధీ లతలను చూసి  తన్మయత్వం చెందాడు. ఈ క్షేత్రముల మహాత్యము బ్రహ్మకైనా వర్ణింప తరమా! ఇక్కడి మిగతా వింతలను రేపు వచ్చి చూసేదను అని అనుకుంటూ ఉండగా మిట్ట మధ్యాహ్నము అవడముతో ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కాని వెళ్ళలేకపోయాడు. తన కాళ్ళకు రాసుకున్న పాదలేపము మంచు నీటితో కరగి పోవడము గుర్తించాడు. అతను పైకి ఎగరలేనందుకు చింతిస్తూ। ఏమి నా దురదృష్టము, సిద్ధుని పాదలేప ప్రభావమున ఘోరాటవిలో వచ్చి పడితిని. ఎక్కడి అరుణాస్పద పురము, ఎక్కడి హిమాలయాలు! ముందు వెనుకలు ఆలోచించ కుండ ఇక్కడ వచ్చి పడ్డాను, వచ్చిన దారి తెలియదు, తిరిగి వెళ్ళుటకు మార్గమేది?  సిద్ధుని ఔషధ మాహాత్యము తెలిసికొనుటకు ఏ ద్వారకనో అవంతికకో, కురుక్షేత్రముకో గయకో ప్రయాగకో వెళ్ళకుండ, ఈ ఘోరారణ్యమునకు వచ్చితిని, ఎంతటి తెలివి తక్కువ వాణ్ణి నేను? ముందు వెనుకలాలోచించని మందమతులు గదా   బ్రాహ్మణులు?
     ఒక్క నిముషం కూడ నన్ను చూడకుండ ఉండలేనటువంటి మా నాన్న ఎంత బాధ పడుచున్నాడొ! సంధ్యా సమయము లో ఎప్పుడు పలకరించే నా తల్లి నన్ను గానక ఎంత వ్యధ చెందుతుందో కదా! అనుకూలవతి అయిన నాభార్య ఎంత బెంగ పెట్టుకుంటుందో కదా! నా శిష్యులెలా ఉన్నారో? అతిథులకు చేయు సేవలు ఏమైనాయో   దేవతార్చన, నిత్యాగ్ని హోత్రములు లేకుండ ఎంత పాపాన్నిమూటకట్టుకుంటున్నానో కద! దైవము నాపై కనికరము లేక ఇక్కడ పడవేసాడు, నేను ఇల్లు చేరే ఉపాయము చెప్పే పుణ్యాత్ముడెవరో మరి? అని చింతిస్తూ భయపడుతూ సంచరిస్తున్నాడు.
     ఒక్క అడుగు వేస్తే లోయలో పడిపోయేటట్లు   నిట్ట నిలువుగా ఉన్న కొండ చరియలను, కాలు మోపితే లాక్కోపోయే అమిత వేగముతో ప్రవహిస్తున్న గంగా ప్రవాహాన్ని చూస్తూ, ఇసుక వేసినా కూడ క్రిందపడనటువంటి, సూర్యకిరణములు కూడ సోకడానికి వీలు లేని దట్టమైన అడవులను గుండా నడచాడు.  చివరకు మోదుగ, పున్నాగ పోక చెట్లతో కూడిన మరియుచిలుకలు కోయిల మెదలగు పక్షుల కిలకిలారావములతో ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇది ఒక ఆశ్రమము వలె ఉన్నది. ఇందులోకి ప్రవేశిస్తే నా ఇంటికి వెళ్ళడానికి ఏదో మార్గము దొరకక పోదు. అని తన దిగులును కొంత దిగమ్రింగుకొని   ఆ ప్రవరాఖ్యుడు ఆ వన వాటిక లోకి వెళ్ళాడు. అచట ద్రాక్ష చెట్లతో సువాసనలిస్తున్న పూలతో తీగలతో ఉన్న తోటలో అందమైన భవనాన్ని చూసి దాని దరిదాపులకు వెళ్ళాడు. వెంటనే అచ్చట స్త్రీలున్న సూచనగా కస్తూరి మరియు చందనములో కూడిన ఒక చక్కటి శీతల పవనము ఆతన్నిని స్పృశించినది. ఇంకా కొన్ని అడుగులు వెయగనే మెరపు తీగ వలే  పద్మము వంటి కన్నులు కలది,,లెడి వంటి నడుము కలది,చంద్రబింబము వంటి ముఖము కలది, సింహ మధ్యమ వంటి నడుము కలది అయిన ఒక  స్త్రీ రత్నాన్ని కనుగొన్నాడు. ఆ సమయములో ఆ అతివ తన మణిమయ మందిరమందు గల తోటలో మామిడి చెట్టు క్రింద గల ఒక పాలరాతి గద్దెపై కూచొని చకక్కని పాటలు పాడుతూ, వీణ వాయిస్తూ నెచ్చెలులు తాళాలు వాయిస్తూ ఉండగా అరమోడ్పు కన్నులతో రతి పారవశ్యము లాంటి తన్మయత్వము చెందుతూ ఉంది.
        ఒక్కసారి కనులు తెరిచి చూడగనే ఎదురుగా నలకూబరుని మించిన అందముతో నున్న ఆ విప్రవరుని కనుగొన్నది.  ఆతనిని చూడగనే ఆ వనితామణికి మేను పులకరించింది వెంటనే అచ్చటి నుండి లేచి ముందుకు వచ్చి ఒక పోక చెట్టు మాటున నిలబడి అ అందగాణ్ణి చూస్తూ నిలబడ్డది.
   ఆతని రూపలెఖా విలాసములకు ఆశ్చర్యపొతూ తన మనసులో ఇలా తలపోస్తుంది.
            ఎక్కడినుండి వాచ్చినాడు, యక్షతనయుడా, ఇంద్రుడా చంద్రుడా జయంతుడా మన్మధుడా, చక్క దనములోవారందరు   వీడి ముందు తక్కువే. ఈ భూలోకములో ఇంతటి అందగాళ్లు ఉంటారా! ఇతడు నన్ను పరియణమాడుతే నా అంత అదృష్టవంతులు   ఉండరు. మన్మధుడు కూడా వీడిముంది దిగదుడుపే! అని మనసులో తీయని కలలు కంటూ ఆ తనికి ఎదురుగా వచ్చి నిలచినది. ఆ ప్రవరుడు ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు.
   ఉ. ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితి\న్‌
గ్రొవ్వున నిన్నగాగ్రమునకు\న్‌ జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగు\న్‌.      39

   అని తన వృత్తాంతాన్ని చెప్పగా ఆ సుందరి కనులు త్రిప్పుతూ చెవి కమ్మలు కదలుతుండగా ఆతనిని ఆట పట్టించాలని “భూసురోత్తమా! ఇంత పెద్ద కన్నులు పెట్టుకొని నన్నే ఎవ్వరివని ప్రశ్నిస్తున్నావు, ఏకాంతములో ఉన్న యువతులను ఎదో ఒక మిషతో పల్కరించుట తగునా నీకు, నీవు వచ్చిన త్రోవ నీకు తెలియదా । మేము మీకు చులకనగా కనపడుతున్నామా? అని పరిహాసముగా పల్కి మళ్ళీ తన గురించి “లక్ష్మీ మా తోబుట్టువు, గాంధర్వ విద్య మాకు కులవిద్య.   కైలాసము, వైకుంటము ఇంద్ర సభలలో మేము ఆడి పాడుతాము. నా పేరు వరూధిని, ఘృతాచీ తిలోత్తమ రంభాహేమా శశిరేఖలు నా ప్రాణ సఖులు. మేము విహారమునకై అన్ని లోకాలు తిరుగుతాము. ముఖ్యంగా రత్న కాంతుల వలె మెరిసే హిమ శిఖరాలలో, మెఘాల మధ్య మరియు ఈ గంగా తీరమందు చల్లటి మలయ మారుతములందు పూల పొలదరిండ్లయందు సంచరిస్తాము. ఓ విప్రవర్యా!  నవ మన్మధుడా! నీవు మా ఇంటికి అతిథి గా వచ్చావు, ఎండ దెబ్బ తాకి మల్లె పూవు వంటి నీ మోము వాడి పోయినది. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా గృహాన్ని పావనము చెయ్యి.” అనగానే ఆ బ్రాహ్మణుడు ఓ హంసగమనా నీ ఆదరాభిమానములకు సంతసించితిని.
      మేము ఇచ్చట ఉండడానికి వీలుకాదు, వెంటనే పోవాలి, నీ భక్తి ప్రపత్తులు చాలు నాకు, నా పై దయయుంచి నేను ఇల్లు చేరుటకు ఉపాయము చెప్పు., మీరు గంధర్వులు కదా, మీ మహత్యము గొప్పది. మీరు తలచుకొంటే సాధ్యము కానిది లెదు. అని ఆ ప్రవరుడు వేడుకొంటు అడుగగా ఆమె ఎక్కడ మీ ఊరు? ఒక్కచోట కాలు నిలువదా మీకు, మీ ఊర్లో ఉన్న కుటీరమునకు మా రత్నాల మేడ సరిపోదా! ఇక్కడి పూల పరిమళాను వెదచల్లే పూలపొదరిండ్లు, ఇక్కడి గంగా తీరములు ఇవి అన్ని వదలి ఇంటికి వెళ్ళాలని ఒకటే తొందర పడుచున్నావు, నీ పై నాకు మనసు పడింది. ఈ పొదరిండ్లలో నన్ను కౌగలించి నన్ను సుఖపెట్టు. అని అనగానే ఆ ప్రవరుడు వరూధినితోఓ పద్మాక్షీ!  ఇలా” వావి వరుసలు చూడకుండ మాట్లాడటము నీకు తగునా! నియమ నిష్టలతో ఉన్న మా లాంటి విప్రులను కోరవచ్చునా! కొద్దిగా కూడా ఆలోచించ వలదా! నేను నిత్యపూజలకు అతిథుల సేవకు దూరమయ్యాను ఈ రోజు భోజనానికి వేళ మించిపొయింది. నా తలితండ్రులు కడు ముదుసలి వారు. నా కొరకై ఎదురు చూస్తుంటారు. నేను ఇంటికి చేరకుంటే నా సమస్త విధులకు దూరమవుతాను.
         “ఓ సుందరాంగా! ఇటువంటి వైదిక కర్మలు చేసేది స్వర్గ సుఖాల కొరకె గదా! మా కౌగిళ్ళలో సుఖించుటకొరకే గదా! అటువంటి సుఖము ఎదురుగా లభిస్తుండగా కాదనడము తగునా! “అని వరూధినీ పలికగా బ్రవరుండు “ నీవన్నది  నిజమే అది కోరికలు గల వారికి వర్తిస్తుంది.నాకు అటువంటి కోరికలు లేవు, నాకు నగరపు త్రోవ జూపి పుణ్యవంతురాలువు కమ్ము,ఇంద్రియ లోలుడనై పాతకానికొడిగట్తలేను.” అని పల్కెను.
    శా.   ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ'
యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?
             అని వరూధిని మోహ పారవశ్యముతో ప్రవరుని కౌగలించుకొని ముద్దిడ బోగా ఆతడు   “హా ! శ్రీ హరీ!” అని ఆ అతివ భుజాలను పట్టుకొని దూరము గా త్రోసి వేసాడు.
    అప్పుడు సిగ్గు తో అవమానముతో కోపముతో ప్రవరినితో పాపిష్టి వాడా! నీవు నన్ను త్రోసివేయగా నీ వాడి గోర్లు నన్నెట్లు గాయపరచినవో చూడు!  అని తన వక్షస్థలాన్ని చూపించి అతి జాలిగా    “ఎన్నో యఙ్ఞములు తపస్సులు చేసినావని చెప్పుతున్నావు? నీకు భూత దయ తెలియదా, నన్ను ఇలా హింసించ వచ్చా? ఇన్ని చదువులు చదివినావు ఎందులకు వ్యర్థము కదా? పూర్వము పరాశరుడు దాసి కన్యను గర్భవతిగా చేసి కులహీనతను పొందినాడా? విశ్వామిత్రుడు మేనక ప్రేమలో పడినా కూడ బ్రహ్మర్శి అయ్యాడు కదా ।   మాందకర్ణి ఐదుగురు అప్సరలతో కాపురము చేయలేదా!  అహల్య ను పొంది సుఖించిన ఇంద్రుడు స్వర్ఘాధిపతి యే కదా! వారి కంటే నీ గొప్పతనమేమి? ఆకులు అలములు తిని అరణ్యములో ముక్కు మూసికొని తపస్సు చేస్తు ఉన్న మునులు కూడ మా కౌగిళ్ళలో బందీలు అవుతారుగదా।“ అని పలుకగా ఆ ప్రవరుడు వరూధినికి మారుపలకక    జవ్వాది కస్తూరి వాసనలంటిన తన శరీరాన్ని శుభ్రపరచుకొని శుచియై ఆచమించి అగ్నిని   ప్రార్థించి ఇలా వేడుకొన్నాడు..
    ఉ.  దాన జపాగ్నిహోత్ర పరతంత్రుఁడనేని, భవత్పజాంబుజ
ధ్యాన రతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా!
           అని   ప్రార్థించగా అగ్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ అగ్నిదేవుని కృపచే వాయువేగంబున   ఇంటికి చేరుకొని నిత్య కృత్య సత్కర్మల యందు నిమగ్నుడయ్యె నని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని ఖగేంద్రుడు జైమినికి చెప్పెను.

                        జైమిని ముని ఖగేంద్రునితో వరూధినికి   తరువాత ఏమి జరిగింది, ఆ వృత్తాంతము చెప్పుమని అడిగెను.