Thursday 12 November 2020

దీపావళి పండుగ సందర్భంగా అమావాస్య రోజు జరుపుకునే కేదారేస్వర వ్రతం లో చెప్పబడు కథ

 

            శ్రీ కేదారేశ్వర వ్రతకథ

కథాప్రారంభం॥     పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యము లో శౌనకుడు మొదలగు మహర్షులు సమావేశమై ఉండగా  సూతపౌరాణికుండు వారిని  చూచి ఈవిధంగా     చెప్పాడు.

          ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యములను కలుగచేయు నదియు, పార్వతీదేవిచే  ఆచరించబడి  మహా దేవుని శరీరములో అర్ధ భాగము పొందినది ఐనటువంటి వ్రతం  కేదా రేశ్వర వ్రతము అని ఒకటి  కలదు. వ్రతవిధానమును వివరించెదను వినండి. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరును ఆచరించవచ్చును. వ్రతమును ఇరువది యొక్క మారులు అనగా 21 సం॥ రాలు  ఆచరించిన వారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము (కైలాస ప్రాప్తి) పొందుతారు.                                                         

                                            వ్రతమాహాత్మ్యమును (వ్రతము యొక్క గొప్పతనమును)  తెలిపే కథ వివరిస్తాను వినండి.   పూర్వము ఒకప్పుడు కైలాసము లో  ఒక పర్వత శిఖరము   నందు జగత్కర్తయైనపరమేశ్వరుడు ప్రమథగణములచే పరివేష్టింప బడి కొలువై ఉన్నాడు. భవానీ సమేతుండై (పార్వతితో కలిసి) దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్ను డై కూర్చుండి ఉన్నాడు . బ్రహ్మ మొదలగు దేవతలు  సూర్యుడు చంద్రుడు, అగ్ని  వాయుదేవుడు,  చంద్రుడు, ఇంద్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు,  అప్సరసలు, గణపతియు, షన్ముఖుడు, నంది, భృంగి మొదలగు ప్రమథ గణములు  కొలుచుచుండగా  అద్భుతమైన ఆ  సభయందు నారదుడు తుంబురుడు గానం చేసారు. ఆ గానానికి అనుగుణంగా  మేనక మొదలయినవారు నాట్యము చేసారు.ఆ తరువాత  ప్రమధ గణము లోని వాడైన భృంగిరిటి అను భక్తుడు కూడా   స్వామి సన్నిధియందు నాట్యము చేయగా సకల దేవతలకు మిక్కిలి నవ్వు  కలిగెను. అటువంటి పెద్ద నవ్వు ల వలన పెద్ద  కలకలధ్వని కలిగెను.

      అప్పుడు ఆ నాట్యము చూచి శివుడు  మిక్కిలి సంతోషించిన వాడై   భక్తుని అనుగ్రహించి దీవించెను. అంతట భృంగిరిటి శివానుగ్రహము కలుగుటచేత మిక్కిలి     ప్రీతి చెంది పార్వతిని వదిలి పరమేశ్వరునకు మాత్రము ప్రదక్షిణమొనర్చెను. ఇది చూచి పార్వతి స్వామీ! భృంగిరిటీ నన్ను వదలి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి అని ప్రశ్నించగా ఈశ్వరుడు దేవీ!  పరమార్థవిదులగు యోగులకు నీ వలన ఏమియు ప్రయోజనము లేదని అందు వలన ఆతడు నాకు మాత్రమే నమస్కరించెనని చెప్పెను. మాటలకు పార్వతీదేవి మిగుల కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా   స్వామి శక్తి లేని కేవలం అర్థశరీరము కలవాడయ్యెను. అంత దేవి కూడ శక్తి లేనిదై వికటమైన రూపము కలదిగా మారెను. పిదప ఆ దేవి దేవతలచేత ఊరడింపబడినదైనను కోపం వీడక  కైలాసమును వదలి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి  ఋషి శ్రేష్ఠులతో కూడిన గౌతమాశ్రమమును ప్రవేశించెను.అంత గౌతముడు ఆశ్రమమున  సర్వాలంకృతురాలై యున్న మహేశ్వరిని కనుగొని పూజ్యురాలైన భగవతీ ! నీవు ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి? అని అడుగగా దేవి గౌతముని చూచి తన విషాదమునకు కారణమును చెప్పి నమస్కరించి, మునీశ్వరా! వ్రతము యోగులకు సమ్మతమైనదో, వ్రతము చేత శంకరుని దేహములో అర్థభాగము తిరిగి తనకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశింపుమని అడుగగా మహర్షి  సకల శాస్త్ర పురాణాలను అవలోకించి  శ్రీకేదా రేశ్వర వ్రతమును సూచించి   దేవికి  వ్రతమును ఆచరించు  విధానం కూడా  వివరిస్తాడు.  అమ్మా! శుద్ధ మనస్కురాలవై  భాద్రపద శుక్లాష్టమియందు   మంగళకరములగు ఏకవింశతి హరిద్రా  తంతువులచేత (21 వరుసల దారమును పసుపు రాసి తోరముగా తయారు చేసుకొని) తోరమును హస్తమునందు ధరించి, పూజించి, దినమందు ఉపవాసమొనరించి, మరునాడు భోజనము చేసి, అది మొదలు అమావాస్య వరకు వ్రతమును చేయాలి. ప్రతిదినము శ్రీ కేదారేశ్వరుని ఆరాధింపవలయును. ఇంటియందు శుభ్రమైన ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభమును ఉంచి, ఇరువది యొక్క సూత్రముల(దారముల) చేత చుట్టి, పట్టువస్త్రములచే కప్పి, నవరత్నములుగాని, శక్తికొలది బంగారంకాని ఉంచి గంధ పుష్పాక్షతలచే పూజించి ఇరువది యొక్కమంది బ్రాహ్మణులను పిలిపించి వారికి పాదప్రక్షాళనాది కృత్యములు ఆచరించి  వారిని సత్కరించి శ్రీ కెదారేశ్వర స్వామిని  చందన  ధూప, దీపములతో అర్చించి చక్కగా స్తోత్రము చేసి  21 రకాల  పిండివంటలతో, పళ్లు, కొబ్బరికాయ మొదలగు వాటిని  నైవేద్యం పెట్టి,  బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి  ఆ దేవ దేవుని  యందు  మనస్సును లగ్నము చెసి ఆ కేదారేశ్వరుని సంతుష్టి పరచిన యెడల నీకు కోరిన వరములియ్యగలడు అని చెప్పగా కాత్యాయని అటులే ఆచరించెను. అంత పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచ్చటికి వచ్చి తన  శరీరములోని  అర్థభాగము ను పూర్వము వలనె పార్వతికి  ఇచ్చెను అప్పుడు  పార్వతీ దేవి మిక్కిలి సంతోషించి నా వలె ఈ వ్రతము ఆచరించువారలకు సకల అభీష్టములు (అన్ని కోరికలు) తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును, అందరును వ్రతమును ఆచరింతురని శంకరునికి చెప్పగా శివుడు అటులే యగుగాక  వర మిచ్చెను.

               కొంతకాలమునకు శివభక్తి కల చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన వ్రతవిధానమును తెలుసుకొ6 ని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికి  చెప్పవలెనను కోరికతో ఉజ్జయినీ పట్టణమును చేరి వజ్రదంతుడను రాజునకు వ్రతమును ఉపదేశించగా అతడు వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యెను.  మరికొంత కాలమునకు పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును యుక్త వయస్సు లైన తరువాత ఒకరోజు తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు ఆనతీయుమని అడుగగా అతడు, అమ్మా! నేనుమిగుల దరిద్రుడను, మీరు ఆలోచనను మానుడు అనగా తండ్రీ! నీ అనుజ్జయే (అంగీకారమే)మాకుపరమధనము యధా శక్తి ఆచరిస్తాము   కావున ఆనతీయుమని తండ్రి అనుఙ్ఞ పొంది   అచ్చటనుండి  ఒక వటవృక్షము (మర్రిచెట్టు) వద్ద వెళ్ళి ఆ చెట్టు క్రింద  కూర్చుండి తోరము కట్టుకొని భక్తి తో  ప్రార్థించి పూజ చేయగా వారి భక్తికి మెచ్చి శ్రీ కేదారేశ్వరుడు పూజకు కావలసిన సామగ్రి అచ్చట వారికి సమకూరు నట్లుగా చేసెను. అంతట వారలు చక్కగా వ్రతము చేసికొనుటవలన మహాదేవుండు సంతుష్టుడై  కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు, దివ్య రూపములు ఇచ్చి అంతర్థానమయ్యెను.ఆవ్రతము యొక్క మాహాత్మ్యము వలన  కాంచీ పురమును పట్టణమును ఏలుచున్న  రాజు కాంతార విష్ణుండు అను రాజు పుణ్యవతియను కన్యను చూచి మోహించి ఆ వైశ్యుని ఒప్పించి పెండ్లి యాడెను. అదే విధముగా ఉజ్జయిని మహంకాళీ పట్టణమును ఏలుచున్న   విక్రమదిత్య  భూపాలుడు భాగ్యవతియను కన్యను పెండ్లి చేసికొనెను.      వైశ్యుడు కూడ  ధనసమృద్ధి కలిగి సుఖముగా వుండెను..

       కొన్ని రోజుల తరువాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్యము తో గర్వాంధు రాలై  తన చేతి మీది తోరమును నల్లగా ఉన్నదని తీసి వేసి ఒక కాకర చెట్టుపై వేసెను. వ్రతమును మరచెను. ఆ కాకర చెట్టు పూవులతో పిందెలతో లెక్క లెనంత కాపు కాయు చుండెను.ఆ అపరాధము వలన భాగ్యవతి శరీరము నిండా వ్రణములేర్పడి చీము నెత్తురు కారుచుండెను. రాజు ఆమెను అసహ్యించుకొని  బయటకు వెడల గొట్టెను.  ఆమె  అడవి దారి పట్ట వలసి వచ్చెను. చివరికి  అడవిలో దూర్వాసముని ఆశ్రమమునకు చేరేను.  అ ముని దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి  ఆమె చేసిన అపరాధానికి పరిహారంగా మంత్రించిన  ఒక  తాయెత్తు ఆమె మెడలో వేసెను. ఆమెకు స్వస్థత  చేకూరి  నవ మాసములు నిండిన తదుపరి ఒక చక్కని బాలుని కనెను. ఆ బాలుడు అదే ఆశ్రమములో పెరిగి 8 సం॥ రల వాడు అయ్యెను.  అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రి గురించి బంధువుల గురించి అడుగగా ఆమె దుఃఖించి కొడుకును దగ్గరకు తీసుకొని మీ నాన్న విక్రమాదిత్యుడు,మీ పెద్దనాన్న కాంతార విష్ణుడు. మీ పెద్దతల్లి పుణ్యవతి , నా కర్మ కొద్ది మీ నాన్న చే వెడలగొట్ట బడి, ఇచ్చట ఉండ వల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పగా ఆ పిల్లవాడు అయితే నేను పెద్ద తల్లి వద్దకు వెల్తానని చెప్పగా  ఆమె అనుఙ్ఞ ఇచ్చింది .  ఆ బాలుడు తల్లి అనుఙ్ఞ తీసుకొని మహర్శి కి నమస్కరించి వారు దీవించగా బయలుదేరి   పుణ్యవతి ఉండే కాంచీ నగరానికి  వెళ్ళి పెద్ద తల్లి కి  తమ కష్టములను తెలుపగా పుణ్యవతి అతని చేతికి తగిన ధనాన్ని  ఇచ్చి పంపిస్తుంది.   అంత  ఆ బాలుడు  ధనమును తీసికొని వచ్చుచుండగా, మార్గంలో కొందరుదొంగలు డబ్బును కాజేసారు. అతడు మరల పెదతల్లి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరికొంత ధనమును ఇచ్చెను.ఆధనముకూడా దొంగిలించబడగా దిక్కుతోచక నిలబడియున్న కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై చిన్నవాడా! వ్రత భ్రష్టులకు (వ్రతమునాచరించనివారికి) ధనము చెందదని చెప్పగా అతడు మరల పెదతల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి, తన చెల్లెలు కూడా వ్రతమును ఆచరించునట్లు చెప్పవలసినదిగా చెప్పుమని అతనికి ధనమును ఇచ్చి పంపెను. అతడు బయలుదేరి వెడుతుండగా అనుకోని విధముగా ముందు పోయిన ధనమంతయు కూడ దొరికినందున  సంతోషము తో వెళ్తూ ఉంటాడు.  మార్గ మధ్యములో వేటకై వచ్చిన విక్రమాదిత్య మహారాజు ఆ పిల్ల వానిని చూచి ఆతని ముఖ వర్చస్సు కు ఆశ్చర్య పడి ఆతనిని దగ్గరకు  పిలిపించుకొని విచారించగా ఆతడు తన కొడుకె అని తెలుసుకొని అప్పుడే ఆ బాలుడి తో పాటు ఆశ్రమమునకు వెళ్ళి  భాగ్యవతిని కలిసి మహార్షి అనుఙ్ఞ తో భాగ్యవతిని కొడుకును తీసుకొని రాజ్యానికి  వచ్చి  సుఖంగా ఉంటారు.   అది మొదలువారు వ్రతమును ఆచరిస్తూ  వారు సకల సంపదలనుభవించుచు  చివరకు శివ సాయుజ్యం పొందుతారు.

   శ్లో॥ యస్య స్మృత్యాచ నో మోక్త్యా  తపః పూజాక్రియాదిషు।             

           న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమీశ్వరం॥

 శ్లో॥  మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర।                                            

          యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే॥

                  అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయా భగవాన్సర్వాత్మకః

                    శ్రీ కేదారేశ్వర  దేవతా స్సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు॥

                         ॥ఏతత్ఫలం శ్రీ కేదారేశ్వర చరణారవిందార్పణమస్తు

                    అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట                                        శ్రీ కేదారేశ్వర  ప్రసాదం శిరసాగృహ్లామి అని అక్షంతలు పైన వేసుకోవాలి.

         ఉత్తర పూజ॥ పునఃపూజార్థే ….. నమస్కరోమి॥ ఉద్వాసన॥  శ్లో॥ గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర। శోభనార్థే పునరాగమనాయచ। యధాస్థానం ప్రవేశయామి    అని ఉద్వాసన పలుకాలి.

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home