Thursday, 12 November 2020

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లోని ఐదు అధ్యాయముల కథలు సులభ శైలిలో

 

శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

॥శ్రీ సత్యనారాయణ వ్రతకథ॥

॥అథ ప్రథమాధ్యాయము॥

శ్లో॥ ఏకదా నైమిశారణ్యే ఋషయశ్శౌనకాదయః।

                                       ప్రపుఛ్ఛరానతం మునయ సర్వే సూతం పౌరాణికం ఖలు॥

        ఒకసారి కొనకాది మహామునులు నైమిశారణ్యంకి వెళ్ళి అక్కడున్న సూతమహామునిని  దర్శించారు. వారు  ఆయనతో  " స్వామీ! సకల ఐశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా  తెలపండి" అన్నారు దానికి వారు. “ శౌనకాది మహామునులారా! పూర్వం ఇదే ప్రశ్న  నారదులవారు  విష్ణుమూర్తిని అడిగారు. విశేషాలు చెప్పుతాను శ్రద్ధగా వినండి.అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోక క్షేమం గురించి  సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరు ఆనందంగానే ఉన్నారు కాని భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. దు:ఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది. కావచ్చు, ధనధాన్యాం కోసం కావచ్చు. కారణమేదైనా దుఃఖశాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి, తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గర కెళ్ళాడు. అచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతుల లో శంఖ, చక్ర, గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని  దర్శించి భక్తితో పూజించి పరమేశ్వరా! నీవు అపరిమితమైన శక్తి గలవాడవు. సర్వలోకాలకు మేలు చేయగల వాడవు : భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు.” అనగా విని "భక్తా ఏమి నీ కోరిక ?" అన్నాడు విష్ణుమూర్తి.

         దానికి నారదమహాముని " భగవంతుడా! మానవలోకంలో ప్రతి ఒక్కరు    ఏదో విధంగా బాధుడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలచుకుంటే వారికి తరుణో పాయం చూపించలేవా?  నామీద నీకు ఏమాత్రం దయ ఉన్నా, వాళ్ళ మీదకి కృపారసాన్ని  విస్తరించుఅన్నాడు. నారదముని  యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు నారదా! లోక శ్రేయస్సు కు నువ్వు  మంచి చేయదల్చుకుంటే నేనెందుకు సాయి పడను? మానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే ప్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలని నివారించే ప్రతమొకటి ఉంది.      దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని యధావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి.” అన్నాడు.

         స్వామీ! వ్రత ఫల మెటువంటిది? దాని విధాన మేమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేసారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి." అన్నాడు నారదుడు.

    అప్పుడు ఆ శ్రీ హరి “దీనిని ఆషాడంలో కాని, కార్తీక మాసంలో కాసి, మాఘమాసంలో కాని, వైశాఖంలో కాని ( , కా, మా, వై) ఏకాదశి రోజు కాని, పూర్ణిమనాడు కాని, సూర్యసంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని రోజుల్లోనే చేయాలని లేదు. రోజన్నా, నెలలో అన్నా    సంవత్సరములోనైనా చేయవచ్చు. నెల కొకసారి చేయవచ్చు, సంవత్సరానికొక సారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టె ముందు కాని, ఏదైనా పని ప్రారంభించే ముందు కాని, ఆపద కలిగి నప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా  చేయవచ్చు. ప్రొద్దున్న లేచి, కాల కృత్యాలు తీర్చుకొని, విధంగా సంకల్పం  చెప్పుకోవాలి: “దేవతలందరికీ ప్రభువైన భగవంతుడా! నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. లక్ష్మీ పతీ! నా పై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను”. అలా  అని  భక్తి శ్రధ్ధలతో  సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి(రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు). పూజాగృ హాన్ని శుధ్ధి  చేసి, పిండితో ముగ్గులు వేసీ అచ్చట ఒక పీటపై  అంచుగల  కొత్త  తెల్ల తువాల పరువాలి. దాని మీద బియ్యం  పోసి ఒక కలశ  పాత్ర (వెండి, రాగి, ఇత్తడి ఏదైనా) పెట్టి దాని మీద కొబ్బరి కాయ నుంచి దాని మీద రవికెలగుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో  సత్యనారాయణస్వామి ప్రతిమను  చేయించి పెట్టవలెను. (అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు).  సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది సవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు  అష్టదిక్పాలకులు స్వామికి అంగదేవతలను ముందుగా  పూజించాలి. ముందు {వరుణదేవుణ్ణి} కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరవాత గణేశుడు మొదలగు పంచ లోక పాలకులను అయిదుగురిని  ప్రతిష్టించి నిర్మల మనస్సుతో  పూజించాలి.

    దీనికి జాతి, మత, కుల విబేధాలు లేవు. వర్ణము వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయు వచ్చు. నారదా!  వ్రతము అన్నిరకాల సంపదలను ఇస్తుంది.  దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది.పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి" అన్నాడు. ఒక మంచి రోజు చూసి, బంధు మిత్రులను పిలిచి, పంచభక్ష్య పరమాన్నాలు చేసి, పూలు, ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి, బంధు మిత్రులకు, విందు భోజనాలు పెట్టి, ప్రసాదము తాను తిని యితరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి  సంతోషముగా ఉంటారు. వ్రతము విశేషముగా కలియుగములో  విశేష పలితాన్నిస్తుంది చెందినది అని విష్ణుమూర్తి  నారదునికి చెప్పి నట్లు  సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు.

                  ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః॥ ఓం తత్సత్॥

                       శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                 అథ ద్వితీయాధ్యాయః॥

        ఋషులారా! పూర్వం వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీ పట్టణములో ఒక  చాలా  బీద బ్రాహ్మణుడుండేవాడు. తినటానికి సరియన తిండిలేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయి అతని కష్టము లేమిటో  చెప్పమని అడిగాడు. బాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు. దానికామహా విష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే  సకల కోరికలు తీరుస్తాడు. సమస్త దు:ఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చేయమని, ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్జాన మయ్యాడు. రాత్రి బ్రాహ్మణుడు నిద్రపోక, ప్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి  మర్నాడుదయాన్నే బిక్షాటనకు  బయలు దేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమ కూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేసాడు. ఆదేవ దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదల కధికారి అయ్యాడు. అప్పటినుంచి అతను ప్రతి నెలా వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది, అతి దుర్లభమైన మోక్షమును పొందాడు.

           కాబట్టి వ్రతమును ఏమనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగుతాయి.   బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేసారో తెలపమని శౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూతమహర్శి వారు ఇలా చెప్పుతారు. ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా, ఒక రోజు ఒక కట్టెలమ్మే  అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగ దాహం వేసి, నీళ్లు అడుగుదామని వస్తే, అక్కడ ఏదో పూజ జరుగుతూండటం చూసి బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి, ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి,  కట్టెలమ్మ అతనికి వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. వ్రతమయ్యేవరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని, వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానన అనుకుంటాడు, అనుకోవటమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కల్సి వ్రతం చేసాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు,గోధుమ పిండి మొదలగు వాటిని  సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి   నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహత్యముచే ఆతడు  పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహ లోకంలో సుఖ సంతోషాలతో  జీవించి సత్య లోకమునకు చేరాడు.

   ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయో ధ్యాయః॥     ఓం తత్సత్॥

               శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హారతి  ఇవ్వాలి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                ॥తృతీయాధ్యాయము॥

                పూర్వము సత్మవాక్కు గల ఉల్కా ముఖుడనే రాజు ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు. అటు భద్రశీలా  అనే నదీతీరమున భార్యతో కలిసి సత్యవ్రత మాచరిస్తుండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, “ రాజా! ఇది ఏమి వ్రతము? దీని ఫలితమేమిటి" అన్నాడు. రాజు వివరంగా చెప్పి "నాకు పిల్లలు లేరు, పిల్లలు కలుగడానికి చేస్తున్నాను" అనగానే వైశ్యుడు, "రాజా! నాక్కూడా పిల్లలు లేరు,  నేను కూడ ఈ వ్రతం చేస్తాను", అంటూ ఆరోజు ఇంక వ్యాపారానికి స్వస్తి  చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య యైన  లీలావతికి  ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే   వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే సత్య దేవుడు అతనికి ఒక కుమార్తెను  ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాలేదు కదా!  అమ్మాయికి కళావతి  అని నామకరణం చేసారు. కానీ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది.యుక్త వయస్సు వచ్చింది.భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్ళి లో చేద్దాం లే అని దాట వేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ   కాంచీ పురం లో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్ళి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్ళి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక  హద్దు ఉంటుంది కదా! దాంతో నారాయణమూర్తి  కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు, కొంత కాలమయ్యాక    మామా, అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసాను పురానికి వెళ్ళారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాప వశము చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొత మంది దొంగలు  రాజు గారి ఖజానా నుండి సామ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న  చోట డబ్బు వదిలేసి పారిపోయారు.  ఇంకేముంది? భటులు మామ  అల్లుళ్ళని పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీన పరచుకున్నాడు. వాళ్లు కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ యింటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినటానికి తిండిలేక, సరియన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రదికేవారు.

                అలా తిరుగుతుండగా   కళావతి ఒక రోజు ఒకరింట్లో  సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి, చివరి వరకు ఉండి, తీర్థప్రసాదాలు తీస్కుని ఇంటికి వస్తుంది,  ఆలస్యంగా ఇంటికి చేరిన  తన  కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది  తల్లి. తర్వాత విషయం  విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతే కాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి, భర్తా, అల్లుడి రాకకోసం ఆగకుండా వెంటనే బంధు మిత్రులతో కూడి వ్రతం నిష్టగా చేసి, భక్తిగా దేవుడ్ని వేడుకుంది. తన భర్తను, అల్లుడ్ని క్షేమంగా ఇంటికి చేర్చమని   కోరుకుంటుంది.   పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్మ దేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్ర కేతు మహారాజు కలలో కన్పించి, వైశ్యులు అమాయకులని, వాళ్ళని విడుదల చేసి వాళ్ళ  డబ్బులు వాళ్ళకిమ్మని, అలా చేయని పక్షంలో అతనికి రాజ్యనష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెప్పుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే రాజు మర్నాడు నిండుకొలుపులో తన స్వప్న వృత్తాంతం చెప్పి వైశ్యులను చెఱనుండి విడిపించాడు.    వైశ్యులకు ఇంక భయము లేదని, దైవ వశము వలన దుఃఖము కలిగిందని చెప్పి, వాళ్ళకి స్నానపానాదులు చేయించి, మంచి బట్టలు యిచ్చి, వాళ్ళకి రెట్టింపు డబ్బు యిచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు

      ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయో ధ్యాయః॥  ఓం తత్సత్॥ 

                శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                        ॥అథ చతుర్థోధ్యాయః॥ 

     రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించటానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారియై వచ్చి, “మీ ఓడలో ఎమి  ఉందని అడిగాడు. వైద్యులు సన్యాసిని లెక్కచేయక పొగరుగా " దండీ! ఏముంటే నీకెందుకు?  దొంగిలించటానికి వచ్చావా? ఆకులు, అలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. “తథాస్తు" అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడ కేసి చూడగా అతను పలికినట్లే ఆకులములు తప్పు ఏమీ లేకపోవటంతో మూర్చపోయినంత పనయి, దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనేమామా! ఇది త్రిదండి శాపమే! ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా నున్నాడు. ఎలాగైనా అతని వద్దకు  పోయి వేడుకుందాం పదండి" అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు త్రిదండి, “బాధపడకు, నువ్వు నీ మాటనుల్లంఘించావు. నా పూజకు విముఖడయ్యావు. అందుకే నీకు మాటిమాటికీ దుఃఖం కలుగుతోంది. అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు. " నారాయణ మూర్తీ!   బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. మూఢుడనగు నేనెలా తెలుసుకొనగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము. నాశక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామీ?" అన్న ప్రార్థనకు ప్రసన్నుడయిన ఆ దేవ దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగుప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన  ముఖ్య  భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. అది చివరలో ఉంది. సంతోషవార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది.  భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగి పోయేలా చేసాడు. కళావతి భర్త కనబడక పోవటంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, " స్వామీ! ఇది అంతా భగవంతుని మాయ! ఆ నారాయణుని  యొక్క మాయని తెలుసుకొన శక్తులెవరు?" అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలయింది. వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను,అని   దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు సత్యదేవుడా వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు. “ సాధూ నీ కుమార్తె  నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి పరుగెత్తుకు వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది.” కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అక్కడికక్కడే, అప్పటికప్పుడే వైశ్యుడు సత్య దేవుని పూజ చేసి తర్వాతే  ఇంటికి వెళ్ళాడు. అప్పట్నుంచి ప్రతి పూర్ణిమకి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు.

          ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయః॥   ఓం తత్సత్॥

          శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                         ॥అథ పంచమోధ్యాయః॥

          ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజొకడు గలడు. ఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక   చెట్టుకింద సేద దీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి, ఆ తరువాత  రాజుగారికి  భక్తి  శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు  ఇచ్చిన ప్రసాదం భుజించటం ఇష్టంలేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు. ధనధాన్యములు అన్ని నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయక పోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి గోపకుల దగ్గరకెళ్ళి వాళ్ళతో కలిసి   సత్యదేవుని పూజించాడు. అప్పుడతని నూరుగురు కొడుకులను, ధనధాన్యములను తిరిగి పొందాడు. " మునులారా! చూసారా!ఎవరు మిక్కిలి దుర్లభమైన సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. నాలుగు వర్ణాలలో వర్ణం వారైనా చేయెచ్చు. ఎప్పుడైనా చేయెచ్చు. పుత్రులని పొందుతారు. బంధ విముక్తి పొందుతారు. భీతుడు భయం కోల్పోతాడు. చివరికి సత్యపురమునకి వెళ్తాడు. శౌనకాది మునులారా! వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తి గల వాడవుతాడో అట్టి సత్యనారాయణ ప్రతమును మీకు  చెప్పాను.                   ఇది  కలియుగములో విశేషఫలప్రదము గలది,  దేవుడిని  సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్య దేవుడని కూడా చెప్తారు. సత్య దేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున మునిశ్రష్టులారా! వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్య దేవుని కృపచే నశించునని శౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు.

        ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమో ధ్యాయః॥     ఓం తత్సత్॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

             శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥

                 నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి మహా నైవేద్యం సిరా ప్రసాదం పంచామృతాలు కొబ్బరి అరటి పళ్ళు కొబ్బరి నీళ్ళు  లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ 

        మంగళ హరతి॥           మంత్ర పుష్పం॥    

శ్లో॥ యస్య స్మృత్యాచ నో మోక్త్యా  తపః పూజాక్రియాదిషు।

           న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం॥

 శ్లో॥  మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన। 

       యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే॥

          అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయా  చ                        భగవాన్సర్వాత్మకః శ్రీ రమా సహిత సత్య నారాయణ స్వామ                    దేవతా  స్సుప్రీతా సుప్రసన్నావరదా భవతు॥

               ॥ఏతత్ఫలం సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు                         అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.  

                    పిమ్మట  శ్రీ సత్యనారాయణ   ప్రసాదం శిరసాగృహ్లామి అని అక్షంతలు 

                         పైన వేసుకోవాలి.

         ఉత్తర పూజ॥ పునఃపూజార్థే ….. నమస్కరోమి॥ ఉద్వాసన॥  శ్లో॥ గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర। శోభనార్థే పునరాగమనాయచ। యధాస్థానం ప్రవేశయామి.               అని ఉద్వాసన పలుకాలి.          

7 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. స్వామి చాలా సంతోషం😊

    ReplyDelete
  3. ధన్యవాదములు

    ReplyDelete
  4. సులభంగా సుందరంగా ఉంది. ధన్యవాదాలు

    ReplyDelete
  5. చాలా సరళంగా, సంపూర్ణముగా చెప్పారు 👏👏

    ReplyDelete